కోర్టు కేసుల పెండింగ్ అంశాలపై కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్ష : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Sakshitha news

కోర్టు కేసుల పెండింగ్ అంశాలపై కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్ష : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ కోర్టు డ్యూటీ అధికారులతో కోర్టు కేసుల పురోగతి, పెండింగ్ అంశాలు, కేసుల పరిష్కారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కోర్టు కేసులకు సంబంధించిన ప్రొటెస్ట్ పిటిషన్లను సక్రమంగా పర్యవేక్షించాలని, నేర విచారణ ప్రక్రియ నిబంధనలైన సీఆర్‌పీసీ 82, 83 ఉత్తర్వులకు సంబంధించిన పెండింగ్ అంశాలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ సూచించారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, నాన్‌-బెయిలబుల్ వారెంట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించి, సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, దర్యాప్తు అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కోర్టుల నుంచి జారీ అయ్యే సమన్లను సకాలంలో అమలు చేయించి, ఎలాంటి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులు, ఈ-పెట్టీ కేసులను వారంవారీగా సమీక్షిస్తూ, క్రమం తప్పకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ-ఎఫ్‌ఐఆర్, ఈ-ఛార్జ్‌షీట్లకు సంబంధించిన వివరాలను కోర్టు డ్యూటీ అధికారులు తమ పరిధిలోని కోర్టుల్లో సక్రమంగా పరిశీలించాలని, ఏవైనా లోపాలు లేదా పెండింగ్ అంశాలు ఉంటే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.

కోర్టుల్లో ప్రతిరోజూ జరిగే కేసుల విచారణ వివరాలను సక్రమంగా నమోదు చేసి, ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని ఆదేశించారు. కోర్టు సంబంధిత పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు, దర్యాప్తు అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.

వచ్చే సమీక్షా సమావేశంలోపు పై అంశాలన్నింటిపై స్పష్టమైన పురోగతి సాధించాలని, పెండింగ్ కేసులు మరియు కోర్టు సంబంధిత అంశాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.

ఈ సమావేశంలో డీసీఆర్‌బీ సీఐ రాజు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ రాఘవయ్య, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.