కోదాడ ఆసుపత్రిలో శరవేగంగా నూతన భవన నిర్మాణాలు

Sakshitha news

కోదాడ ఆసుపత్రిలో శరవేగంగా నూతన భవన నిర్మాణాలు

ప్రజలకు నాణ్యమైన వైద్యమే ధ్యేయం: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సాక్షిత – సూర్యాపేట జిల్లా/కోదాడ: కోదాడ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన, మెరుగైన ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఇన్‌పేషెంట్ విభాగాన్ని స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు.

రూ.26 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా 30 పడకల సామర్థ్యం ఉన్న కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.26 కోట్లు మంజూరు చేసిందని, నూతన భవనాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఆసుపత్రి పునరుద్ధరణలో భాగంగా ఎగ్జిస్టింగ్ బ్లాక్‌తో పాటు నూతన ఇన్‌పేషెంట్ విభాగం నిర్మాణం పూర్తికావడంతో ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

అన్ని రకాల ఉచిత వైద్య సేవలు పునఃప్రారంభం

నుంచే ఆసుపత్రిలో అన్ని రకాల ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినందున కోదాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ, లక్ష్మారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ, డీసీహెచ్‌ఎస్ వెంకటేశ్వర్లు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ, డాక్టర్ సుబ్బారావు డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి ఇతర వైద్యులు ప్రజా ప్రతినిధులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.