మా ఆస్తులు, మీ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా..?!!
-సీఎం రేవంత్ రెడ్డి కి కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిరిసిల్లలో పర్యటించిన సీఎం..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 35 మంది చేనేత కార్మికుల కుటుంబాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. బాధిత కార్మిక కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటిస్తారని ఆశించామని, కానీ సీఎం శత్రుదేశం పై దాడికి వెళ్లినట్లు వచ్చి కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు కావస్తున్నా ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.
ఎన్నికల హామీల అమలుపై మేం గట్టిగా నిలదీస్తుండటంతో మాపై కక్షగట్టి మాట్లాడుతున్నారు. తొమ్మిదో తరగతి ఫెయిల్ అయిన సీఎం తమ్ముడు ఏరోస్పేస్ కంపెనీ ఎలా పెట్టారో సమాధానం చెప్పాలని, నేను 2006లోనే హోటల్ వ్యాపారం ప్రారంభించా, అది ఇప్పుడు మూడు హోటళ్లుగా విస్తరించింది. ఈ విషయాలన్నీ నేను స్వయంగా ఎన్నికల అఫిడవిట్లలోనూ పారదర్శకంగా వెల్లడించా. వ్యాపారం చేయడం నేరమా?” అని కేటీఆర్ తీవ్రంగా ప్రశ్నించారు. తమ కుటుంబంపై ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలను తిప్పికొడుతూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. “దమ్ముంటే మా కుటుంబ ఆస్తులతో పాటు మీ కుటుంబ ఆస్తులపై విచారణ జరిపించేందుకు సుప్రీంకోర్టు- హైకోర్టు సిట్టింగ్ జడ్జికి లేఖ రాయండి. సమగ్ర న్యాయ విచారణలో మాది తప్పని తేలితే ఎలాంటి శిక్షకైనా మేము సిద్ధం” అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి చిల్లర రాజకీయాలతో ప్రతిపక్షాన్ని బెదిరించలేరని, హామీలు అమలయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రజాక్షేత్రంలో నిరంతరం నిలదీస్తూనే ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
