సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా

Sakshitha news

సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా..
ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..
సెప్టెంబర్ 19న కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అధికారులను ఆదేశించారు.మంగళవారం కోదాడలోని సీసీ రెడ్డి కాన్వెంట్‌లో మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్, కంపెనీల ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు, వాహనాల పార్కింగ్, తాగునీరు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో యువత హాజరయ్యే అవకాశం ఉన్నందున శాఖల వారీగా బాధ్యతలు కేటాయించి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందేలా జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.