నేటి సమాజానికి రిజర్వేషన్లు సమీక్ష అవసరం
సచిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సమాజంలో సమానత్వం కోసం ప్రారంభమైన రిజర్వేషన్ల విధానం నేటి పరిస్థితుల్లో మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉందని భావన వ్యక్తమవుతోంది. స్వాతంత్ర్యం సాధించి 78 ఏళ్లు గడిచాయి. అయినప్పటికీ రిజర్వేషన్ల ఉద్దేశం ఎంతవరకు నెరవేరిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిరుపేదలు, అక్షరాస్యతకు, అభివృద్ధికి దూరంగా ఉన్న సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఉద్దేశం నెరవేరిందా?
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ, అసలు లబ్ధి ఎవరికీ అందుతోంది? నిజమైన పేదలకు అందుతోందా? లేక ఆ వర్గాల ధనికులు మాత్రమే లాభపడుతున్నారా? అనే చర్చ మళ్లీ మొదలైంది. అట్టడుగు వర్గాలకు విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడమే లక్ష్యం. కానీ ఇప్పటికీ గ్రామీణ పేదలు అదే పేదరికంలో మగ్గుతున్నారు. చదువులో, ఉపాధిలో ముందుకు వెళ్లలేని వారు ఎందరో ఉన్నారు.
ధనవంతులకే లాభం
కులాల పేరుతో రిజర్వేషన్లు పొంది ఉన్నత స్థానాలకు ఎదిగినవారు, తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. అయినా “మాకు రిజర్వేషన్లు కావాలి” అంటున్నారు. ఇది ఆయా వర్గాల పేదలకు అన్యాయం కాదా? ఒకసారి రిజర్వేషన్ పొంది అభివృద్ధి చెందిన కుటుంబాలు తమ పిల్లలకు కూడా అదే సౌకర్యం కోరుకోవడం వల్ల పేదలకు అవకాశాలు దక్కడం లేదు. విద్య, ఉద్యోగ రంగాల్లో పోటీ తట్టుకోలేని పరిస్థితికి కూడా ఇదే కారణమని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
క్రిమిలేయర్ అమలు తప్పనిసరి
ఏ కులమైనా వార్షిక ఆదాయం ₹8 లక్షల కంటే ఎక్కువగా ఉన్నవారికి రిజర్వేషన్లు అవసరమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రిజర్వేషన్లు నిజమైన పేదలకు చేరాలంటే “క్రిమిలేయర్” సూత్రాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి రిజర్వేషన్ పొందిన కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందిన తర్వాత, మళ్లీ ఆ అర్హత ఇవ్వకూడదని చాలా మంది సూచిస్తున్నారు. అలా చేస్తే, నిజంగా వెనుకబడిన పేద కుటుంబాలకు ఆ అవకాశం దక్కుతుంది.
పాలకుల బాధ్యత
పాలకులు, రాజకీయ పార్టీలు రిజర్వేషన్లను ఓటు బ్యాంకుగా వాడుకోవడం సమాజానికి హానికరం. రిజర్వేషన్లను పెంచడం, కొత్త కులాలకు విస్తరించడం వంటి నిర్ణయాలు చట్టపరమైన, రాజ్యాంగపరమైన సమీక్ష లేకుండా తీసుకోవడం దేశానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించి, ధనికులను తొలగించి, నిజమైన పేదలకు మాత్రమే రిజర్వేషన్లు వర్తించేలా చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది. కులం, మతం కాకుండా పేదరికమే ప్రమాణంగా ఉండాలి.
మేధావుల ఆలోచన అవసరం
రిజర్వేషన్ల సద్వినియోగం లేకుండా కొనసాగితే, మరో 100 సంవత్సరాలు గడిచినా పేదల పరిస్థితి మారదని స్పష్టమవుతోంది. కాబట్టి సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. మేధావులారా ఆలోచించండి…
రిజర్వేషన్లు ధనికులకు కాకుండా, నిజమైన పేదవారికి మాత్రమే దక్కేలా చర్యలు తీసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత.
రచయిత : కుసుమ సిద్దారెడ్డి

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
