పర్యాటక అభివృద్ధితో ‘బ్రాండ్ తెలంగాణ’కు ప్రపంచ గుర్తింపు….

Sakshitha news

పర్యాటక అభివృద్ధితో ‘బ్రాండ్ తెలంగాణ’కు ప్రపంచ గుర్తింపు….

27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతగా అభివృద్ధి చేయాలి….

— సీఎస్ సంజయ్ జాజ్జు…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి ‘బ్రాండ్ తెలంగాణ’కు ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని సూచించారు.

వర్షాభావ పరిస్థితులు, పర్యాటక అభివృద్ధి, నీట్‌–పీజీ పరీక్ష ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో రహదారులు, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, పారిశుద్ధ్యం, సూచిక బోర్డులు తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. ప్రతి పర్యాటక ప్రాంతానికి స్పష్టమైన కార్యాచరణ, బాధ్యతలు, కాలపరిమితిని నిర్ణయించి పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆదేశించారు.

తెలంగాణ సంస్కృతి, కళలు, హస్తకళలు, చారిత్రక వారసత్వం, స్థానిక ఆహారం, పండుగలను ప్రపంచానికి పరిచయం చేసేలా పర్యాటక ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. స్థానికులకు ఉపాధి కల్పించేలా హోమ్‌స్టేలు, స్థానిక గైడ్ సేవలను ప్రోత్సహించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.

నీట్‌–పీజీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు
ఆగస్టు 30న నిర్వహించనున్న నీట్‌–పీజీ 2026 ప్రవేశ పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో 17,627 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.

పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, జనరేటర్‌ సౌకర్యం, వెలుతురు, గాలి ప్రసరణ తదితర మౌలిక వసతులను ముందుగానే పరిశీలించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, కృత్రిమ మేధ ఆధారిత కళ్లద్దాలు, గూఢ కెమెరాలు వంటి నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని ఆదేశించారు.

వర్షాభావ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో ప్రస్తుతం 22 శాతం లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో పంటలు, సాగునీరు, తాగునీటి లభ్యతపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సీఎస్ సూచించారు. అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుని రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీపీ రామ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, డీవైఎస్‌ఓ సురేష్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top