అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
పేద ప్రజల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం….
— మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, జూలపల్లి/ : ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు రేషన్ కార్డులు అందజేస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్ల పంపిణీ చేపట్టిందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని మంత్రి తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు చొరవ తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వానికి అందేలా చూడాలని సూచించారు.
అబ్బాపూర్ గ్రామ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అబ్బాపూర్–పెరికపల్లి రహదారి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాంగ్రెస్ రైతు పక్షపాతి : ఎమ్మెల్యే విజయరమణారావు
కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సరైన ప్రణాళిక లేకుండా చేపట్టిన నిర్మాణాల కారణంగా రైతులకు సాగునీరు అందడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే రైతులకు సాగునీరు అందుతోందని తెలిపారు.
రైతుల ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేస్తున్నామని, రానున్న రోజుల్లో కూడా రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని విజయరమణారావు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండె వెంకటేష్, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, పీఏసీఎస్ చైర్మన్లు లోక జలపతి రెడ్డి, పుల్లూరి వేణుగోపాల్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
