నేరాల నియంత్రణలో సాంకేతికతను సమర్థంగా వినియోగించాలి….
ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించాలి….
–డీఐజీ అంబర్ కిశోర్ ఝా…
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, భూపాలపల్లి/ వార్షిక తనిఖీల్లో భాగంగా కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్ ఝా, ఐపీఎస్ కొయ్యూరు పోలీస్ స్టేషన్, మహాదేవపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని సమగ్రంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ డీఐజీకి ఘన స్వాగతం పలికారు.
తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, మాల్ఖానా, ఆయుధాగారం, వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది టర్న్‌అవుట్, క్రమశిక్షణ, యూనిఫాం నిర్వహణ తదితర అంశాలను డీఐజీ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి విధి నిర్వహణ, పనితీరు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించిన డీఐజీ, సీసీటీవీ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించి నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్ పోలీసింగ్, నిఘా పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా CCTNS 2.0, e-Sakshya, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ దర్యాప్తు, సోషల్ మీడియా మానిటరింగ్ వంటి అంశాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. పెండింగ్ కేసులను సకాలంలో పరిష్కరించడంతో పాటు నేరస్తుల కంటే ఒక అడుగు ముందుండేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు.
డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వేగంగా పరిష్కరించేలా సేవలందించాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొయ్యూరు పోలీస్ స్టేషన్, మహాదేవపూర్ సీఐ కార్యాలయ ఆవరణలో డీఐజీ అంబర్ కిశోర్ ఝా మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కాటారం సీఐ నాగార్జునరావు, మహాదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
