క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు…

Sakshitha news

క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు…

సింగరేణి నీటితో పంట భూములు ముంపునకు గురికాకుండా ముందస్తు కార్యాచరణ….

— కలెక్టర్ కోయ శ్రీహర్ష…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, మంథని/ : క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

మంథని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ కన్నాల గ్రామంలోని వ్యవసాయ భూములు, అడవి సోమనపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, సోమనపల్లిలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మంథని మున్సిపల్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు.

కన్నాల గ్రామంలో సింగరేణి నీటి కారణంగా వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయన్న రైతుల ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. ప్రస్తుతం ఎలాంటి పెద్దస్థాయి ముంపు జరగలేదని తెలిపారు. భవిష్యత్తులో సింగరేణి నీటి వల్ల పంట భూములు ముంపునకు గురికాకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సింగరేణి అధికారులను ఆదేశించారు.

అడవి సోమనపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను పరిశీలించిన కలెక్టర్, వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలను ప్రారంభించేలా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనుల పురోగతికి నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

సోమనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి కనీస విద్యా ప్రమాణాలను సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధన చేపట్టాలని, విద్యార్థుల సామర్థ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

అనంతరం మంథని మున్సిపల్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులకు అవసరమైన వాహనాలు, ఇతర సౌకర్యాల కోసం తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు.

పాత సీసీ రోడ్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో డ్రైనేజీల నిర్మాణం, అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పట్టణంలో పారిశుద్ధ్యం, మౌలిక వసతుల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమాల్లో మంథని మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top