మంజూరైన రైల్వే పనులు వెంటనే ప్రారంభించాలి…
పెద్దపల్లికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు….
—ఎంపీ గడ్డం వంశీకృష్ణ….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, హైదరాబాద్/ : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మంజూరైన రైల్వే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దక్షిణ మధ్య రైల్వే అధికారులను డిమాండ్ చేశారు. ప్రజల నిధులతో మంజూరైన ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచడం సరికాదని స్పష్టం చేశారు.
₹1,000 కోట్లకు పైగా విలువైన ఆర్ఓబీలు, ఎఫ్ఓబీలు, ఇతర రైల్వే అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరైనా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాకపోవడంపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైల్వే బోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారుల వరకు నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంపై అధికారులను ప్రశ్నించారు.
“మంజూరు చేసి పనులు ప్రారంభించకపోతే ఆ నిధులు ఎందుకు? ప్రజల కోసం మంజూరైన ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం కాకుండా నేలమీద కనిపించాలి” అని వంశీకృష్ణ స్పష్టం చేశారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ఒక్కో స్టేషన్కు సుమారు ₹30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దాదాపు ₹150 కోట్ల విలువైన పనులు పూర్తయ్యేలా నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పెద్దపల్లి ప్రాంతం నుంచి రైల్వేకు భారీగా ఫ్రైట్ ఆదాయం వస్తున్నప్పటికీ, అదే స్థాయిలో రైల్వే మౌలిక వసతులు కల్పించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగరేణి, బొగ్గు గనుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, రైల్వే సరుకు రవాణాకు పెద్దపల్లి గణనీయమైన ఆదాయం అందిస్తున్నప్పటికీ, ప్రాంత అభివృద్ధి ఎందుకు వెనుకబడాలని ప్రశ్నించారు.
“ఇది ఎవరి వ్యక్తిగత డబ్బు కాదు.. ప్రజల సొమ్ము. పెద్దపల్లి ప్రజల హక్కు. మంజూరైన ప్రతి రూపాయి అభివృద్ధి పనుల్లో ఖర్చు కావాల్సిందే” అని వంశీకృష్ణ తేల్చిచెప్పారు.
బీజేపీ ప్రాతినిధ్యం లేని ప్రాంతాల పట్ల వివక్ష చూపుతున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని, ఈ అంశాన్ని కేంద్ర రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లి సమాధానం కోరుతామని తెలిపారు.
పెద్దపల్లి హక్కుల కోసం ఢిల్లీ నుంచి క్షేత్రస్థాయి వరకు పోరాటం కొనసాగిస్తామని, మంజూరైన ప్రతి రైల్వే ప్రాజెక్టు ప్రారంభమయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
