దేవాలయ భూములను అందరం కలిసి కాపాడుకుందాం.
భూముల పరిరక్షణ కమిటీ పిలుపు.
జగద్గిరిగుట్ట లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూములను కాపాడుకుందాం అని కోరుతూ నేడు దేవాలయం వద్ద దేవాలయ భూముల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశం సందర్భంగా జగద్గిరిగుట్టలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన 14 ఎకరాల ఆరు గుంటల ప్రభుత్వ స్థలం నేడు అన్యాక్రాంతమవుతుందని గత కొద్ది సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఉన్న స్థలం కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నందున జగద్గిరిగుట్ట ప్రజలందరూ కలిసి ఈ స్థలాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సినటువంటి ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు గాని, రాజకీయ పార్టీల నాయకులు గాని, రెవెన్యూ అధికారులు కానీ కనీసం స్పందించడం లేదని అందుకే ప్రజలందరిని కలుపుకొని ఈ భూముల పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని అన్నారు.
స్థానిక రెవెన్యూ అధికారులకు అనేకసార్లు విజ్ఞప్తులు ఇచ్చినప్పటికీ వారు చేస్తున్నామని చెప్పి కూల్చకపోవడమనేది రెవెన్యూ అధికారులే ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోందని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిడిలోకి లొంగకుండా వెంటనే అక్కడ ఏర్పడ్డ అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిందిగా డిమాండ్ చేశారు. హైకోర్టు చెప్పినప్పటికీ కలెక్టర్ గారికి మరియు ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చినప్పటికీ కనీస స్పందన లేకపోవడం దురదృష్టకరమని, కొత్తగా వచ్చిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమో లేక స్వార్థం వల్లో ఆగిన కబ్జాలు మళ్ళీ మొదలయ్యాయని ఇప్పటికైనా వాటిని ఆపకపోతే ప్రజల దృష్టిలో వారు కబ్జాదారులకు సహకరించినట్టేనని భావిస్తారన్నారు. దేవాలయ స్థలాలను కాపాడుకోవడానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి మా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దేవాలయ భూముల పరిరక్షణ కొరకు శనివారం నాడు సంతకాల సేకరణ, ఆదివారం నాడు రిలే నిరాహార దీక్షలు మొదలు చేసి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తామని దానికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, జనసేన నాయకులు సతీష్, బిజెపి నాయకులు మాధవులు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు రాములు ఏఐటీయుసీ కార్యదర్శి శ్రీనివాస్ కోశాధికారి సదానంద్ ప్రజానాట్య మండల అధ్యక్షులు బాబు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
