కమ్యూనిటీ సీసీ కెమెరాల ధ్వంసం కేసులో కౌన్సిలర్ సహా ఐదుగురి అరెస్ట్
ప్రజా భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
సూర్యాపేట సాక్షిత ఉమ్మడి జిల్లా బ్యూరో) :
ప్రజా భద్రత కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో స్థానిక కౌన్సిలర్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. సోమవారం రాత్రి చివ్వెంల మండల పరిధిలోని బీబీగూడెం గ్రామంలో (సూర్యాపేట మున్సిపాలిటీ 3వ వార్డు) ప్రజా భద్రత కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాలను కొందరు ధ్వంసం చేస్తున్నట్లు డయల్-112కు సమాచారం అందిందన్నారు. సమాచారం అందుకున్న వెంటనే చివ్వెంల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారని తెలిపారు.
ఈ ఘటనకు స్థానిక కౌన్సిలర్ పడిదల సైదులు, అతని అనుచరులు పాల్పడినట్లు గుర్తించామని చెప్పారు. విచారణ సందర్భంగా కౌన్సిలర్‌తో పాటు అతని అనుచరులు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై చివ్వెంల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, 3వ వార్డు కౌన్సిలర్ పడిదల సైదులు, పడిదల దుర్గాప్రసాద్, పడిదల కిరణ్, మత్స రాంబాబు, గోల్కొండ మురళి, పడిదల సతీష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ప్రజా భద్రత కోసం ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, అనుచితంగా ప్రవర్తించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చివ్వెంల ఎస్ఐ మహేష్, ఎస్ఐ వెంకన్నతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
