పెండింగ్ భూ సేకరణను వేగవంతం చేయాలి
పెద్దపల్లి బైపాస్, కూనారం ఆర్ఓబీ పనుల్లో జాప్యం లేకుండా చర్యలు….
— కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములతో కలిసి అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ భూ సేకరణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి బైపాస్ రోడ్డు, కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి తదితర అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణను వేగవంతం చేయాలని సూచించారు. భూ సేకరణ ప్రక్రియపై అధికారులు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
భూ యజమానులకు సంబంధించిన సమస్యలు, భూ వివరాలు, రికార్డుల పరిశీలన, పరిహారం చెల్లింపులు తదితర అంశాలను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. అభివృద్ధి పనులకు భూ సేకరణ కీలకమైనందున పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణీత లక్ష్యాల మేరకు పురోగతి సాధించాలని సూచించారు.
భూ యజమానులతో అవసరమైన చోట సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని, భూ సేకరణ కారణంగా అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
కూనారం ఆర్ఓబీని అక్టోబర్ 15 నాటికి పూర్తి చేయాలి. అనంతరం కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను వేగవంతం చేసి అక్టోబర్ 15 నాటికి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి వాహనాల రాకపోకలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ భావ్ సింగ్, రెవెన్యూ డివిజనల్ అధికారులు బి. గంగయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
