దివ్యాంగులకు అండగా వీపీఆర్ ఫౌండేషన్.. ఇద్దరికి ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్ల పంపిణీ
-కందుకూరు నియోజకవర్గానికి చెందిన బాధితులకు పంపిణీ చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 1,042 ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్ల పంపిణీ
నెల్లూరు జిల్లాలో వీపీఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కందుకూరు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉచితంగా ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లను అందజేశారు. తీవ్రమైన శారీరక వైకల్యం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని ఎంపీ ఈ సందర్భంగా తెలిపారు. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో 1,042 ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండలం, రాచెరువు రాజుపాళెం గ్రామానికి చెందిన బినిగి కోటేశ్వరరావు అనే బాధితుడికి ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ అందించారు. ఈయన రెండు కాళ్లు పనిచేయని స్థితిలో ఉండటంతో పాటు క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్న బాధితుడు కావడం గమనార్హం. అలాగే గుడ్లూరు మండలం, రామయ్యపట్నం (మూర్తిపేట) గ్రామానికి చెందిన చెబ్రోలు రమణమ్మ అనే మహిళకు కూడా వాహనాన్ని పంపిణీ చేశారు. ఆటో ప్రమాదంలో కుడి కాలు తీవ్రంగా దెబ్బతిని నడవలేని స్థితిలో ఉన్న ఆమె, భర్తను కోల్పోయి ఇద్దరు కుమార్తెలతో పడుతున్న కష్టాలను గుర్తించి ఈ సాయం అందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
