కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై బీఆర్‌ఎస్ రణభేరి

Sakshitha news

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై బీఆర్‌ఎస్ రణభేరి….

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రామగుండంలో రోడ్డుపై బీఆర్‌ఎస్ ఆందోళన….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ పేద ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రామగుండంలో భారీ ఆందోళన నిర్వహించారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రామగుండం ఎంఆర్‌ఓ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రైవేట్ పిల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమైన ఈ పథకాలపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు కౌశిక హరి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. గతంలో పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాలని కోరారు. పథకాల అమలులో జాప్యం చేయకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి సకాలంలో ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

పేదల సంక్షేమానికి సంబంధించిన పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. పేదలకు న్యాయం జరిగే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ ఆందోళనలో బీఆర్‌ఎస్ నాయకులు వ్యాల హరీష్‌రెడ్డి, కార్పొరేటర్లు, మాజీ ఇన్‌చార్జ్‌లు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

“పేద ఆడబిడ్డల సంక్షేమ పథకాలను కాపాడే వరకు పోరాటం ఆగదు” అని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

Scroll to Top