బాధితుల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం….

Sakshitha news

బాధితుల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం….

ప్రజావాణి ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి….

— రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి, చట్టపరమైన నిబంధనల ప్రకారం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు.

పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను సీపీ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులను స్వయంగా పరిశీలించిన సీపీ, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలపై పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిగణించి, నిర్ణీత సమయంలో పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీపీ సూచించారు. బాధితులు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువచ్చినప్పుడు సానుకూలంగా స్పందించి, చట్టపరమైన పరిధిలో వారికి న్యాయం అందించేందుకు కృషి చేయాలని అన్నారు.

ప్రజలకు మరింత చేరువగా ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ నిరంతరం కృషి చేస్తోందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.

Scroll to Top