అధిక లాభాల ఆశకు మోసపోవద్దు…

Sakshitha news

అధిక లాభాల ఆశకు మోసపోవద్దు…

సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలి….

–ఎస్‌ఐ సత్యనారాయణ…

సాక్షిత పెద్దపల్లి జిల్లా ప్రతినిధి గోదావరిఖని/ అధిక లాభాల ఆశ చూపించే సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోవద్దని ఎస్‌ఐ సత్యనారాయణ సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సురక్షా కా తిరంగా – సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ వైపు” కార్యక్రమంలో భాగంగా ఇల్లందు క్లబ్‌లో సింగరేణి అధికారులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలు, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే అధిక లాభాల పెట్టుబడి ఆఫర్లను నమ్మవద్దని సూచించారు. నకిలీ షేర్ ట్రేడింగ్ యాప్‌లను నమ్మి పదవీ విరమణ అనంతరం వచ్చిన డబ్బులను పెట్టుబడిగా పెట్టి మోసపోవద్దని హెచ్చరించారు.

డిజిటల్ అరెస్ట్, కేవైసీ, పెన్షన్, పీఎఫ్, లాటరీ, రుణాలు, ఉద్యోగాల పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఇచ్చే పెట్టుబడి సలహాలను నమ్మవద్దని, తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పి వెంటనే డబ్బులు పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కు కాల్ చేయడం ద్వారా సకాలంలో ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు. అనంతరం సింగరేణి అధికారులతో సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సింగరేణి అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top