అర్హులందరికీ చేయూత పింఛన్ అందేలా విస్తృత ప్రచారం…

Sakshitha news

అర్హులందరికీ చేయూత పింఛన్ అందేలా విస్తృత ప్రచారం…

కొత్త పింఛన్ల దరఖాస్తులపై వార్డు వార్డునా అవగాహన కల్పించాలి….

— మేయర్ మహంకాళి స్వామి…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ చేయూత పింఛన్ పథకం ద్వారా లబ్ధి పొందేలా డివిజన్లలో విస్తృత అవగాహన కల్పించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి వార్డు అధికారులను ఆదేశించారు.

కొత్తగా చేయూత పింఛన్ల దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు అధికారులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత కొత్త పింఛన్ల మంజూరుకు మార్గం సుగమం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ల సమన్వయంతో ప్రతి డివిజన్‌లో విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు.

ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, మరణ ధ్రువీకరణ పత్రాలు, వైద్య ధ్రువీకరణ పత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను సంబంధిత కార్యాలయాల ద్వారా త్వరితగతిన జారీ చేసేలా అధికారులతో సమన్వయం చేస్తామని తెలిపారు.

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే 19,659 మంది చేయూత పింఛన్ పొందుతున్నారని, మరో 2,068 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని మేయర్ తెలిపారు. పెండింగ్ దరఖాస్తుల విచారణను కూడా వెంటనే పూర్తి చేసి, అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. విచారణలో ఎలాంటి పొరపాట్లు, అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు.

ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు కూడా పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని మేయర్ పేర్కొన్నారు. స్థానికంగా ఫైలేరియా, డయాలసిస్ బాధితుల వివరాలను పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రుల నుంచి సేకరించి, వారికి పథకంపై అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన వారితో తప్పనిసరిగా దరఖాస్తులు చేయించాలని అధికారులను ఆదేశించారు.

అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె. అరుణశ్రీ మాట్లాడుతూ.. ప్రస్తుతం వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, డయాలసిస్, ఫైలేరియా బాధితులు కొత్త పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు.

దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని పత్రాలను జత చేసి వార్డు అధికారికి లేదా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2026-27 సంవత్సరానికి సంబంధించిన తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాలని తెలిపారు.

వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలు విడాకుల పత్రం, దివ్యాంగులు సదరం ధ్రువీకరణ పత్రం, గీత కార్మికులు కల్లుగీత సొసైటీ సభ్యత్వ ధ్రువీకరణ, ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ పత్రం, చేనేత కార్మికులు జౌళి శాఖ ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుందని వివరించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం ప్రయోజనం అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని, దరఖాస్తుల పరిశీలనను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, పింఛన్ విభాగం ఇన్‌చార్జ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top