విద్యార్థుల భద్రతపై అవగాహన.. షీ టీమ్ ప్రత్యేక సదస్సు….
గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై ప్రతి విద్యార్థికి అవగాహన అవసరం…
— షీ టీమ్ ఇన్చార్జి ఎస్ఐ లావణ్య….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి,గోదావరిఖని/ : రామగుండం సీపీ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో గోదావరిఖని అశోక్‌నగర్‌లోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మహిళలు, బాలికల భద్రత, సైబర్ మోసాలు, డ్రగ్స్ తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ ఇన్చార్జి ఎస్ఐ లావణ్య మాట్లాడుతూ.. విద్యార్థులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
పోక్సో చట్టం గురించి విద్యార్థులకు వివరించిన ఆమె.. బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రభావం విద్యార్థులపై ఎలా ఉంటుందో వివరిస్తూ, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించాలని, తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
మహిళల భద్రతతో పాటు ఆన్లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వల్ల భవిష్యత్తు నాశనం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వేధింపులకు గురైతే 6303923700కు సమాచారం
మహిళల రక్షణ కోసం ప్రతిరోజూ బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జనసమ్మర్థ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా ఉంటుందని ఎస్ఐ లావణ్య తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే మహిళలు, విద్యార్థినులు భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
మహిళలకు ప్రమాదం ఎదురైనా, ఎవరైనా బెదిరింపులకు గురిచేసినా వెంటనే 100/112కు డయల్ చేయాలని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్ చేయాలని తెలిపారు. మహిళలు ప్రయాణ సమయంలో భద్రత కోసం టీ-సేఫ్ (T-Safe) యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ మల్లేష్, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.


