మెహందీ వేడుకతో కళకళలాడిన పీకే రామయ్య కాలనీ ప్రభుత్వ పాఠశాల….
మహిళలు, విద్యార్థినుల్లో దాగిన ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు అభినందనీయం…
— మనాలి ఠాకూర్….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 1వ. డివిజన్ పీకే రామయ్య కాలనీ ప్రభుత్వ పాఠశాలలో మెహందీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 1వ.డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ-మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్థానిక మహిళలు, పాఠశాల విద్యార్థినులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని మెహందీ వేసుకున్నారు. పాఠశాల ఆవరణలో సందడి నెలకొంది.
కార్యక్రమంలో మనాలి ఠాకూర్ మాట్లాడుతూ.. మహిళలు, విద్యార్థినుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీయడానికి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. విద్యార్థినుల్లో ఉత్సాహాన్ని నింపేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్ మడిపెల్లి విజయ-మల్లేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థుల చదువుతో పాటు వారి సృజనాత్మకతను ప్రోత్సహించడం, మహిళలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, మాజీ కార్పొరేటర్ బాలరాజు కుమార్, 1వ డివిజన్ సోషల్ మీడియా ఇన్చార్జి గుర్రాల మల్లేష్ యాదవ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు పల్లికొండ నర్మద, కాలనీవాసులు, ఆర్పీలు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


