“ఎవరికి దుకాణాలు….? ఏ ప్రాతిపదికన కూల్చివేతలు….? వివరాలు బహిర్గతం చేయాలి…
–సీపీఐ…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : రామగుండం కార్పొరేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రతి షాపింగ్ కాంప్లెక్స్‌పై లబ్ధిదారుల పూర్తి వివరాలను బహిరంగంగా ప్రదర్శించాలని సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, సీపీఐ శాఖ కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
తిలక్ నగర్ షాపింగ్ కాంప్లెక్స్‌ను సీపీఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించేలా బోర్డును ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొంతకాలంగా షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, కూల్చివేతల విషయంలో చిరు వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటోందని అన్నారు. ఒకవైపు నిర్మాణాలకు హామీలు ఇచ్చి, మరోవైపు అనుమతులు లేవంటూ కూల్చివేతలకు పాల్పడటం సరికాదని విమర్శించారు.
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రాజేష్ థియేటర్ సమీపంలో, తిలక్ నగర్ సెంటర్, బస్టాండ్ కాలనీ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రతి షాపింగ్ కాంప్లెక్స్‌కు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను బహిరంగంగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే లబ్ధిదారులకు సింగరేణి నుంచి ప్రొసీడింగ్ కాపీలు ఇప్పించడంతో పాటు, మున్సిపల్ అధికారుల ద్వారా బిల్డింగ్ అనుమతులు ఇప్పించే బాధ్యతను ఎమ్మెల్యే తీసుకోవాలని కోరారు.
తిలక్ నగర్ సెంటర్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ జరిగిన సమయంలో జీఎం ఆర్. జీవన్ హాజరయ్యారని, ప్రస్తుతం అనుమతులు లేవంటూ ఎస్‌ఎన్‌పీసీ సిబ్బందిని అక్కడ కాపలాగా ఉంచడం ఏమిటని వారు ప్రశ్నించారు. జీఎం రాజకీయాలకు దూరంగా ఉండి తన విధులను నిర్వర్తించాలని సూచించారు. లబ్ధిదారుల వివరాలు జీఎం వద్ద ఉన్నాయా? ఉంటే వాటి ఆధారంగా ఎందుకు చర్యలు తీసుకుంటున్నారో, లేకపోతే ఏ వివరాల ఆధారంగా కూల్చివేతలు చేపడుతున్నారో బహిరంగపరచాలని డిమాండ్ చేశారు.
రామగుండం నియోజకవర్గంలోని నిర్మాణంలో ఉన్న ప్రతి షాపింగ్ కాంప్లెక్స్‌కు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను బహిరంగపరచాలని ఎమ్మెల్యేను గతంలో కోరినా ఇప్పటివరకు స్పందించలేదని సీపీఐ నాయకులు ఆరోపించారు. 24 గంటల్లోగా లబ్ధిదారుల పూర్తి వివరాలను బహిరంగపరచకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆసాల నవీన్, కొండ్ర దాసు తదితరులు పాల్గొన్నారు.


