ఆడబిడ్డల ప్రాణాలంటే మీకంత చులకనా చంద్రబాబూ..?
- రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలనా.. లేక రాక్షస రాజ్యమా?
- మద్యం ఆదాయంపై ఉన్న శ్రద్ధ, మహిళల ప్రాణాల మీద లేదా?
- ప్రియాంక, హసీనా, పసిబిడ్డ జ్ఞానేశ్వరి.. ఇంకెంతమందిని బలితీసుకుంటారు?
- గంజాయి, డ్రగ్స్ మత్తులో కిడ్నాప్‌లు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా నిద్రపోతున్న ప్రభుత్వం
- ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు
- చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? లేక చచ్చిపోయిందా? ఆడబిడ్డలు ఇంటి గడప దాటితే ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో తెలియని భయానక, దుర్మార్గపు పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు, కసాయి ఖానా అని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక ఘాటైన బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా ఏరులై పారుతున్నాయని, మత్తులో మృగాలుగా మారి అకృత్యాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం మీద, ఖజానా నింపుకోవడం మీద ఉన్న శ్రద్ధ.. ఆడబిడ్డల మానప్రాణాల మీద లేకపోవడం అత్యంత సిగ్గుచేటని దుయ్యబట్టారు.
రాజమండ్రిలో మెడికల్ విద్యార్థిని ప్రియాంకను మృగాలు కారుతో గుద్ది కిరాతకంగా చంపేస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని రామచంద్రయాదవ్ మండిపడ్డారు.
చిలకలూరిపేటలో బీటెక్ చదువుతున్న ముస్లిం బిడ్డ షేక్ హసీనా ఆధారాలు లేకుండా చెట్ల పొదల్లో దహనమైన సంఘటన చూస్తుంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? లేక గాఢ నిద్రలో ఉందా? అని ప్రశ్నించారు. ఇంతటి అమానుష కాండ జరిగినా ముఖ్యమంత్రికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం దారుణమన్నారు.
మరోవైపు పసిబిడ్డ జ్ఞానేశ్వరి అదృశ్యమై రెండు నెలలు గడుస్తున్నా.. ఆ చిన్నారి ఏమైందో ఏ కిడ్నాపర్ల చేతిలో చిక్కుకుందో కనీస ఆచూకీ కనిపెట్టలేని చేతకానితనంలో పోలీసు యంత్రాంగం ఉందన్నారు. కొద్ది రోజులు గాలించి వదిలేశారన్నారు. రాష్ట్రంలో కిడ్నాప్‌లు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యంగా మారుతున్నా, దున్నపోతు మీద వాన పడినట్లు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఆడబిడ్డల ప్రాణాలకు, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని, అది చేతకానప్పుడు ముఖ్యమంత్రికి ఆ కుర్చీలో కూర్చునే నైతిక అర్హత లేదని రామచంద్రయాదవ్ తేల్చిచెప్పారు. తక్షణమే ప్రియాంక, షేక్ హసీనా మరణాలకు కారణమైన కిరాతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తక్షణమే కనిపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియాను ఉక్కుపాదంతో అణచివేయకపోతే.. భారత చైతన్య యువజన (BCY) పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.
విడుదల చేసిన వారు:
కేంద్ర కార్యాలయం,
భారత చైతన్య యువజన (BCY) పార్టీ.


