ఆషాఢ మాస గోరింటాకు వేడుకల్లో వెల్లివిరిసిన మహిళల సందడి…..
దుర్గా నగర్‌లో ఘనంగా గోరింటాకు మహోత్సవం..
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : గోదావరిఖని దుర్గా నగర్ కాలనీలో మహిళా సోదరీమణుల ఆధ్వర్యంలో ఆషాఢ మాస గోరింటాకు మహోత్సవ వేడుకలు ఆదివారం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.
రామగుండం శాసనసభ్యులు మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి, మక్కాన్‌సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి రాజ్ ఠాకూర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలకు స్వయంగా గోరింటాకు పెట్టి వారిని అభినందించారు.
ఈ సందర్భంగా మనాలి రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమని అన్నారు. మహిళలంతా ఒకచోట చేరి సంప్రదాయాలను కొనసాగిస్తూ ఇలాంటి వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
దుర్గా నగర్ కాలనీతో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని, తాము కూడా ఇదే ప్రాంతానికి చెందిన వారిగా స్థానికులతో కలిసి మమేకమై ఉండటం ఎంతో ఆనందంగా ఉందని మనాలి రాజ్ ఠాకూర్ తెలిపారు. ప్రజలతో కలిసి సంప్రదాయ వేడుకల్లో పాల్గొనడం ఆత్మీయ అనుభూతిని కలిగిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో దుర్గా నగర్ కాలనీ మహిళలు, కాలనీ వాసులు, నాయకులు, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


