బుల్లెట్‌ ట్రైన్‌ సాధనకు ఉమ్మడి పోరాటాలు కొనసాగించాలి

Sakshitha news

బుల్లెట్‌ ట్రైన్‌ సాధనకు ఉమ్మడి పోరాటాలు కొనసాగించాలి

అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశంలో నిర్ణయం

సాక్షిత ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో

జాతీయ రహదారి–65 మార్గంలో సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ను నడిపించాలనే డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అన్ని వర్గాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు కలిసి ఉమ్మడి పోరాటాలు కొనసాగించాలని బుల్లెట్‌ ట్రైన్‌ సాధన సమితి అఖిలపక్ష కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆరుట్ల జానకిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని మహావీర్‌ బ్యాంకెట్‌ హాల్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ సాధన కోసం అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తొలుత శంషాబాద్‌ నుంచి సూర్యాపేట మీదుగా అమరావతి, చెన్నై వైపు బుల్లెట్‌ ట్రైన్‌ వెళ్లే విధంగా ప్రతిపాదించినప్పటికీ, అనంతరం అలైన్‌మెంట్‌లో మార్పులు చేయడం వెనుక జరిగిన పరిణామాలపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. సూర్యాపేటకు బుల్లెట్‌ ట్రైన్‌ సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, సూర్యాపేటలో రైల్వే సాధన సమితి పేరుతో కొనసాగుతున్న మరో ఉద్యమ కమిటీ ప్రతినిధులు డేగల జనార్ధన్‌, రాచూరు ప్రతాప్‌లతో అఖిలపక్ష కమిటీ నాయకులు చర్చలు జరిపారు. ఒకే డిమాండ్‌పై రెండు వేర్వేరు కమిటీలు ఉద్యమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో కొంత అయోమయం ఏర్పడుతోందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. సూర్యాపేటకు బుల్లెట్‌ ట్రైన్‌ సాధించాలనే లక్ష్యంతో అన్ని కమిటీలు, సంఘాలు సమన్వయంతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. త్వరలో విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలతో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి ఉద్యమాన్ని గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. బుల్లెట్‌ ట్రైన్‌ సాధన కోసం జరిగే భవిష్యత్‌ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్య సలహాదారు రమణాచారి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, టీజేఎస్‌ రాష్ట్ర నాయకులు కుంట్ల ధర్మార్జున్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అనుములపురి రవి, కునుకుంట్ల సైదులు, మట్టిపల్లి సైదులు, జర్నలిస్ట్‌ భూపతి రాములు, సట్టు నాగయ్య, ఆవుల నాగరాజు, ధనియాకుల శ్రీకాంత్‌, పేర్ల నాగయ్య, నల్లెడ మాధవరెడ్డి, గట్ల రమాశంకర్‌, బూర వెంకటేశ్వర్లు, కారింగుల ఉపేందర్‌, అబ్దుల్‌ కరీం, తండు నాగరాజు, నర్సిరెడ్డి, లతీఫ్‌ తదితర అఖిలపక్ష నాయకులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.

Scroll to Top