ఏడేళ్లుగా ఎదురుచూపులేనా..?
డిపెండెంట్లకు ఉద్యోగాలపై ప్రభుత్వం స్పందించాలి….
— ఏఐటీయూసీ….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి,గోదావరిఖని/ : సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ కేసులకు సంబంధించిన కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ (గుర్తింపు సంఘం) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు.
సింగరేణి ఆర్జీ-1 జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద మారుపేర్లు, విజిలెన్స్ కేసుల కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. డిపెండెంట్ల పోరాటానికి సంఘీభావం ప్రకటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ.. ఈ సమస్య గత ఏడెనిమిది సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉందన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమస్యను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, బాధిత డిపెండెంట్లకు వన్‌టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించినప్పటికీ, ప్రభుత్వం మారడంతో సమస్య పరిష్కారం కాకుండా నిలిచిపోయిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కోల్‌బెల్ట్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఆ హామీతో కోల్‌బెల్ట్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు గెలిచారని పేర్కొన్నారు.
ప్రభుత్వం చొరవ చూపితే సమస్యకు పరిష్కారం
సమస్య పరిష్కారం కోసం అడ్వకేట్ జనరల్‌కు లేఖ రాశామని సింగరేణి యాజమాన్యం చెబుతోందని, అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని యాజమాన్యం యూనియన్‌తో జరిగిన సమావేశంలో తెలిపిందని వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు.
ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు న్యాయశాఖ మంత్రి లేదా అడ్వకేట్ జనరల్‌కు తగిన ఆదేశాలు జారీ చేయిస్తే డిపెండెంట్లకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ యాజమాన్యంతో జరిగిన తొలి స్ట్రక్చర్ సమావేశాల్లోనూ ఈ డిమాండ్‌ను ప్రస్తావించామని, సమ్మె నోటీసులో కూడా ఈ అంశాన్ని చేర్చామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే డిపెండెంట్లకు ఉద్యోగాలు రావడం లేదని ఆయన ఆరోపించారు. కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.
డిపెండెంట్ల న్యాయమైన పోరాటానికి ఏఐటీయూసీ అండగా ఉంటుందని, సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి మద్దతుగా నిలుస్తామని వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, నాయకులు దాసరి శ్రీనివాస్, బిట్టి వెంకటేశ్వర్లు, ఏ.వి.ఎస్. ప్రకాశ్, ప్రీతం, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


