చుండూరు అమరవీరుల త్యాగం మరువలేం.. దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగాలి….
— ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి/ గోదావరిఖని,
చుండూరు దళిత అమరవీరుల త్యాగాన్ని ఎన్నటికీ మరువలేమని, దళితులపై జరిగే కుల వివక్ష, దాడులను సమాజం ముక్తకంఠంతో ఖండించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
చుండూరు ఘటన జరిగి 35 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గోదావరిఖనిలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్‌లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నాయకులు మాట్లాడుతూ, కుల అహంకారంతో చుండూరులో మాల సామాజిక వర్గానికి చెందిన ఎనిమిది మందిని అత్యంత దారుణంగా హత్య చేయడం దేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచిందని అన్నారు.
దళితులకు సంపూర్ణ న్యాయం జరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, చుండూరు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కో-కన్వీనర్ ఆకునూరి బాల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రతినిధి ఈదునూరి పద్మ, సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపల్లి సతీష్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, బొచ్చు శంకర్, జనగామ రాజనర్సు, గద్దల శశిభూషణ్, బూడిద సమ్మయ్య, మేకల సురేష్, పుల్లూరి మహేందర్, పంజా అశోక్, కాంపల్లి జీవన్ కుమార్, రామగిరి రమేష్, జిలకర రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈదునూరి పద్మ, జనగామ రాజనర్సు ఆలపించిన చుండూరు ఘటనకు సంబంధించిన ఉద్యమ గీతాలు సభికులను భావోద్వేగానికి గురిచేశాయి.


