ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం
ఓపీ, ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి….
సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….
సాక్షిత – పెద్దపల్లి జిల్లా ప్రతినిధి | సుల్తానాబాద్ |
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందేలా వైద్యాధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ఓపీ విభాగం, వార్డులు, ప్రసూతి విభాగం, ల్యాబ్, ఫార్మసీతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ (అవుట్ పేషెంట్లు) సంఖ్యతో పాటు ప్రసవాల సంఖ్య కూడా పెరిగేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది సమన్వయంతో ప్రతి గర్భిణిని క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేస్తూ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. హైరిస్క్ గర్భిణులను ప్రత్యేకంగా గుర్తించి నిరంతర పర్యవేక్షణలో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, వార్డులు, మరుగుదొడ్లు, ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రోగులకు అవసరమైన మందులు, వైద్య పరీక్షలు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు అత్యవసర వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి సంతృప్తి చెందేలా సేవలు అందించాలని, రోగుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, అవసరం లేని రిఫరల్స్ను తగ్గించి సాధ్యమైనంత మేరకు స్థానికంగానే నాణ్యమైన చికిత్స అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేలా ప్రతి ఉద్యోగి సేవాభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ తనిఖీలో సంబంధిత వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


