ప్రతి చిన్నారికి భద్రత, విద్య, సంరక్షణ అందించాలి

Sakshitha news

ప్రతి చిన్నారికి భద్రత, విద్య, సంరక్షణ అందించాలి
అనాథలు, చదువు మానేసిన పిల్లలను గుర్తించి ప్రభుత్వ సేవలు చేరవేయాలి….

ఐసీపీఎస్ అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….

సాక్షిత – పెద్దపల్లి జిల్లా ప్రతినిధి | పెద్దపల్లి |

జిల్లాలోని ప్రతి చిన్నారికి భద్రత, విద్య, సంరక్షణతో పాటు ప్రభుత్వ పరిరక్షణ సేవలు పూర్తిస్థాయిలో అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సమీకృత బాలల సంరక్షణ పథకం (ICPS) అమలుపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అనాథ పిల్లలను పూర్తిస్థాయిలో గుర్తించాలని, అలాగే దివ్యాంగులు, మానసిక వైకల్యం కలిగిన చిన్నారులను గుర్తించి వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ (సీసీఐ) హోమ్‌లలో పిల్లలకు అవసరమైన వసతులు, భద్రత, సంరక్షణ కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. పిల్లలకు ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించేలా జిల్లాను మూడు విభాగాలుగా విభజించి పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువు మానేసిన విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి పూర్తి చేసిన పిల్లలకు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ కేంద్రాల ద్వారా నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆసక్తి గల వారి వివరాలను సేకరించాలని సూచించారు.

సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC), జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB) పరిధిలోని కేసుల పురోగతి, బాలల గృహాల తనిఖీలు, ఫోస్టర్ కేర్, స్పాన్సర్‌షిప్ పథకాల అమలు, మిస్సింగ్–ఫౌండ్ చిల్డ్రన్ కేసులు, బాలల భద్రత చర్యలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఫీల్డ్ విజిట్లు క్రమం తప్పకుండా నిర్వహించాలని, అన్ని ఆన్‌లైన్ యాప్‌లలో సమాచారాన్ని ప్రతిరోజూ నవీకరించాలని, పెండింగ్ అంశాలను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పెంచి ప్రభుత్వ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయడంతో పాటు ప్రతి మండలంలో బాలల సంక్షేమ కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top