రామగుండం కార్మికుల హక్కుల కోసం ఢిల్లీలో ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పోరాటం.

Sakshitha news

రామగుండం కార్మికుల హక్కుల కోసం ఢిల్లీలో ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పోరాటం….

స్థానిక యువతకు ఎన్టీపీసీలో ఉద్యోగాలకు ప్రాధాన్యం కల్పించాలని ఛైర్మన్‌కు వినతి….

–పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ…

సాక్షిత పెద్దపల్లి జిల్లా ప్రతినిధి న్యూఢిల్లీ, రామగుండం.
రామగుండం ప్రాంత కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ ఎన్టీపీసీ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్‌ను న్యూఢిల్లీలో కలిసి పలు కీలక డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు గ్రేడ్-బి రేటింగ్ అమలు చేసి, వారికి న్యాయమైన వేతనాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, మెరుగైన సేవా నిబంధనలు కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ఎన్టీపీసీ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

కాంట్రాక్ట్ కార్మికులకు అవసరమైన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను ఈఎస్ఐ ఆసుపత్రి ద్వారా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జారీ చేసే విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈఎస్ఐ వైద్య సదుపాయం ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అదనపు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తీసుకురావాలని ఒత్తిడి చేయడం వల్ల కార్మికులు ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా ఎన్టీపీసీలో నిర్మాణంలో ఉన్న 800×3 మెగావాట్ల సూపర్ థర్మల్ విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకే మొదటి ప్రాధాన్యం కల్పించి భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎంపీ గడ్డం వంశీ కృష్ణ గట్టిగా కోరారు. అర్హత కలిగిన స్థానిక యువతకు ఉపాధి లభిస్తే ప్రాంతీయ అభివృద్ధితో పాటు సామాజిక, ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రామగుండం ప్రాంత అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన విషయంలో ఎన్టీపీసీ సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేయగా, సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్టీపీసీ ఛైర్మన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీ రామగుండం ప్రాంత కార్మికులు, యువతలో ఆశలు రేకెత్తిస్తోంది.

Scroll to Top