విన్నవించిన 24 గంటల్లోనే సీఎంఆర్ఎఫ్ మంజూరు

Sakshitha news

విన్నవించిన 24 గంటల్లోనే సీఎంఆర్ఎఫ్ మంజూరు – ఇద్దరు బాధితులకు అండగా మంత్రి సత్యకుమార్ యాదవ్

బ్లడ్ క్యాన్సర్ బాధితుడికి రూ.5 లక్షలు… వెన్నెముక సమస్యతో బాధపడుతున్న మహిళకు రూ.1.24 లక్షల ఎల్ఓసి మంజూరు

స్పందనలో వేగం… సేవలో మానవత్వం – మంత్రి సత్యకుమార్ ప్రత్యేక చొరవతో రెండు కుటుంబాలకు భారీ ఊరట

డబ్బుల్లేవని చికిత్స ఆగకూడదు… తమని నమ్ముకున్న ప్రజల వైద్యానికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది

ధర్మవరం, ఆగస్టు 04:– ధర్మవరం నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన ప్రత్యేక శైలిని చాటుకుంటున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని ఇద్దరు బాధితులకు కేవలం 24 గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) మంజూరు చేయించి వారి కుటుంబాలకు పెద్ద ఊరట కల్పించారు. ధర్మవరం పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీకి చెందిన షేక్ చాంద్ బాషా బ్లడ్ క్యాన్సర్‌తో తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. మరోవైపు ముదిగుబ్బ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన జి. చంద్రకాంతమ్మ వెన్నెముక సంబంధిత తీవ్రమైన సమస్యతో బాధపడుతూ శస్త్రచికిత్స, వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరి కుటుంబ సభ్యులు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కలిసి తమ పరిస్థితిని వివరించి సహాయం కోరారు. కుటుంబాల ఆర్థిక పరిస్థితిని, వైద్య అత్యవసరతను పూర్తిగా అర్థం చేసుకున్న మంత్రి గారు వెంటనే స్పందించారు. డబ్బుల్లేవని ఎవరి చికిత్సా ఆగకూడదు… తమని నమ్ముకున్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అనే సంకల్పంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ప్రత్యేక చొరవతో సీఎంఆర్‌ఎఫ్ అధికారులతో వెంటనే సమన్వయం చేసి, అవసరమైన పత్రాలను అత్యవసర ప్రాతిపదికన పరిశీలింపజేశారు. ఫలితంగా, విన్నవించిన కేవలం 24 గంటల వ్యవధిలోనే షేక్ చాంద్ బాషా చికిత్స కోసం రూ.5,00,000 విలువైన ఎల్ఓసి మంజూరై అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆసుపత్రిలో చికిత్స అందేలా మార్గం సుగమమైంది. అలాగే జి. చంద్రకాంతమ్మ చికిత్స కోసం రూ.1,24,138 విలువైన ఎల్ఓసి మంజూరై తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS)లో అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు పూర్తయ్యాయి. సాధారణంగా సమయం పట్టే సీఎంఆర్‌ఎఫ్ ప్రక్రియను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా పర్యవేక్షించి అత్యంత వేగంగా పూర్తి చేయించడం ద్వారా రెండు కుటుంబాలకు భారీ ఊరట లభించింది. మంత్రి స్పందన, పరిపాలనా చొరవతో అత్యవసర సమయంలో వైద్య సహాయం అందడం పట్ల బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ధర్మవరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ అవసరమైన సమయంలో వెంటనే స్పందించడం ద్వారా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నారు. ప్రజా సేవ అంటే కేవలం అభివృద్ధి పనులు మాత్రమే కాదు… ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పించడం కూడా అనే విషయాన్ని ఆయన మరోసారి నిరూపించారు.

Scroll to Top