పెట్టుబడులతో పరిశ్రమలు, పరిశ్రమలతో ఉపాధి….

Sakshitha news

పెట్టుబడులతో పరిశ్రమలు, పరిశ్రమలతో ఉపాధి….

మంథని అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: మంథని,

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు, పెట్టుబడులను ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడంతో పాటు అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథనిలో విస్తృతంగా పర్యటించిన మంత్రి, శివకిరణ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మన ఊరు–మన కోచింగ్ సెంటర్’లో ఉచిత కానిస్టేబుల్, ఎస్సై శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం టీ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల విద్యార్థుల క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసి ఉచిత రక్షణ శిరస్త్రాణాలను పంపిణీ చేశారు.

మూడు నెలలు కష్టపడితే ఉద్యోగం మీ సొంతం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రస్తుతం మరో 7 వేలకుపైగా పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే మూడు నెలలు క్రమశిక్షణతో చదివి ఉద్యోగ లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.

ఉచిత శిక్షణతో పాటు పుస్తకాలు, అధ్యయన సామగ్రి, వసతి, భోజన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని, విజయాన్ని సాధించేది మాత్రం యువత కృషి, పట్టుదలేనని పేర్కొన్నారు.

పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
మంథని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థ ప్రతినిధులు, ఇతర పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, నీరు, రహదారులు, ఇతర మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.

బొక్కలవాగు అభివృద్ధికి శ్రీకారం
హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ‘ప్రాజెక్ట్ షైన్’ ద్వారా బొక్కలవాగు చెక్‌డ్యామ్ అభివృద్ధి, సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాజెక్టు కింద వాకింగ్ ట్రాక్, ఉద్యానవనం, బహిరంగ వ్యాయామ కేంద్రం, చిన్నారుల పార్కు, పూడిక తొలగింపు వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి పనుల కోసం సంస్థ రూ.2 కోట్ల నిధులు కేటాయించిందని వెల్లడించారు.

ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి పనిచేస్తే సమాజానికి మరింత మేలు జరుగుతుందని పేర్కొన్న మంత్రి, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
వైద్య సేవల అభివృద్ధిపై సమీక్ష
మంథని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతులు, వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

కోకాకోలా పరిశ్రమకు స్థల పరిశీలన
పర్యటనలో భాగంగా రత్నాపూర్ గ్రామంలో ప్రతిపాదిత కోకాకోలా పరిశ్రమ ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, సంబంధిత శాఖల అధికారులు, సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేసి స్థానిక యువతకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
మంత్రి మాట్లాడుతూ మంథని పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రోడ్ల విస్తరణతో పాటు పలు మౌలిక సదుపాయాల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, సయేందర్ రెడ్డి, తహసీల్దార్ ఆరిఫ్ ఉద్దీన్, ప్రజాప్రతినిధులు, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Scroll to Top