ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు దళితుల అభివృద్ధికే వినియోగించాలి…..
దళిత సమస్యల పరిష్కారానికి డీహెచ్‌పీఎస్ పోరాటం కొనసాగుతుంది….
–డీహెచ్‌పీఎస్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి, : ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను దళితుల సమగ్ర అభివృద్ధికే వినియోగించాలని, వాటిని ఇతర అవసరాలకు మళ్లించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) పెద్దపల్లి జిల్లా సమితి డిమాండ్ చేసింది.
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో దళితుల సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు కందుకూరి రాజరత్నయ్య, జిల్లా కార్యదర్శి పెరుక లక్ష్మణ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు ప్రతి పౌరుడికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడంతో పాటు వారి హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయాలని, ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగంలోనూ దళితులకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.
మతం పేరుతో ఎస్సీలపై వివక్ష చూపడం, హక్కులను హరించే ప్రయత్నాలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. మత విశ్వాసం వ్యక్తిగత హక్కు అని, దానిని ఆధారంగా చేసుకుని ఎస్సీ హోదాపై బెదిరింపులకు పాల్పడటం తగదని హెచ్చరించారు.
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు దళితుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేటాయించినవేనని, వాటిని ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల దళితుల పురోగతికి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. ఆర్థిక స్వావలంబన ద్వారానే దళిత సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు.
దళితుల సమస్యల పరిష్కారం కోసం డీహెచ్‌పీఎస్ నిరంతరం ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహిస్తూ ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్తోందని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శనిగరపు తిరుమల, శనిగరపు చంద్రశేఖర్, ముత్యాల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


