పోరాటం ఫలించింది.. మణుగూరు పీకే ఓసి డీప్ సైడ్ బొగ్గు బ్లాకు సింగరేణికే దక్కింది – కార్మికుల ఐక్యతకు చారిత్రాత్మక విజయం….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: మణుగూరు, : మణుగూరు పీకే ఓసి–2 డీప్ సైడ్ బొగ్గు బ్లాకును 6.5 శాతం రెవెన్యూ షేర్‌తో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ దక్కించుకోవడం కార్మికుల ఐక్య ఉద్యమాలకు లభించిన చారిత్రాత్మక విజయమని గుర్తింపు సంఘం ఏఐటియుసి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
“పోరాటాలు ఎప్పటికీ వృథా కావు” అనే నినాదాన్ని ఈ విజయం మరోసారి సార్థకం చేసిందని వారు తెలిపారు. జెన్కోను వేలంపాట ప్రక్రియ నుంచి తప్పించి, సింగరేణి మాత్రమే వేలంపాటలో పాల్గొనేలా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, గేట్ మీటింగ్‌లు, కార్మిక చైతన్య కార్యక్రమాలు ఈ విజయానికి బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్న ఉద్యమాలు ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించాయని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశాల ద్వారా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో సానుకూల నిర్ణయం వెలువడిందన్నారు.
జెన్కో వేలంపాటలో కొనసాగితే ఈ బొగ్గు బ్లాకు సింగరేణికి దక్కే అవకాశాలు దెబ్బతింటాయని ముందుగానే ప్రభుత్వానికి వివరించామని, కార్మికులను చైతన్యపరిచి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టిన ఫలితంగానే నేడు ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.
6.5 శాతం రెవెన్యూ షేర్‌తో మణుగూరు పీకే ఓసి డీప్ సైడ్ బొగ్గు బ్లాకు సింగరేణికి దక్కడం వల్ల వేలాది మంది కార్మికుల ఉపాధి భద్రత, సంస్థ భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడతాయని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక బొగ్గు బ్లాకు సాధన మాత్రమే కాదని, కార్మికుల ఐక్యత, ఉద్యమ శక్తి, ప్రజల మద్దతుతో సాధించిన చారిత్రాత్మక విజయమని తెలిపారు.
భవిష్యత్తులో కూడా సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం కోసం ఏఐటియుసి ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఉద్యమాలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
