ప్రభుత్వ బడుల అభివృద్ధికి రూ.12 కోట్లతో పనులు…
నాణ్యమైన విద్యే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం….
— విజయరమణరావు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, : ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు అన్నారు.
పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ ప్రభుత్వ పాఠశాల, పెద్దపల్లి పట్టణంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణం, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.12 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రంగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో రూ.26 లక్షలు, బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.20 లక్షల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యాసంస్థలు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నత విద్యాభ్యాసం చేసిన నైపుణ్యం కలిగిన వారని, విద్యార్థుల పట్ల అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సాధించిన విజయాలు దీనికి నిదర్శనమని అన్నారు.
ప్రైవేటు విద్యాసంస్థలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని, మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థుల కోసం అల్పాహారాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని, ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ ఉపాధ్యక్షుడు, స్థానిక కౌన్సిలర్, సర్పంచ్‌లు, పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
