ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు లక్ష్యం….
–కలెక్టర్ కోయ శ్రీహర్ష….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, : జిల్లాలో ప్రతి ఇంటికి, చేతి పంపులు, బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే లక్ష్యంతో వీబీజీ–రామ్‌జీ (VBG–RAM G) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, వర్షాకాలంలో ప్రజలకు కలుషిత రహిత తాగునీరు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వీబీజీ–రామ్‌జీ పథకం అమలు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. వీబీజీ–రామ్‌జీ పథకం కింద అవసరమైన అన్ని పరిపాలనా అనుమతులను వెంటనే మంజూరు చేసి, ఆగస్టు నెలలోనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎంపీడీఓలు గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా తాగునీటి వనరులు కలుషితం కాకుండా మిషన్ భగీరథ అధికారులు ప్రత్యేక అప్రమత్తతతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి పైప్‌లైన్లను క్రమం తప్పకుండా పరిశీలించి అవసరమైన చోట్ల మరమ్మతులు, శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు. క్లోరినేషన్ ప్రక్రియను శాస్త్రీయ పద్ధతిలో నిరంతరం నిర్వహించి ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని పేర్కొన్నారు.
అన్ని ఓవర్‌హెడ్ నీటి ట్యాంకులను నిర్దిష్ట వ్యవధిలో శుభ్రపరచాలని, నీటి నిల్వ కేంద్రాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాలంలో తాగునీటి కలుషితం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహిస్తూ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామపంచాయతీలు, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామంలో సురక్షితమైన తాగునీరు అందించడంతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ గంగాధర శ్రీనివాస్, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
