వైద్యుల కొరతతో కార్మికులు ఇబ్బందులు, ఎన్టీపీసీ ఈఎస్ఐ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి….

Sakshitha news

వైద్యుల కొరతతో కార్మికులు ఇబ్బందులు, ఎన్టీపీసీ ఈఎస్ఐ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి….

ఎన్టీపీసీ ఈఎస్ఐ ఆస్పత్రిని సందర్శించిన సీపీఎం బృందం….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, : రామగుండంలోని ఎన్టీపీసీ ఈఎస్ఐ ఆస్పత్రిని సీపీఎం రామగుండం ఏరియా కమిటీ నాయకులు సందర్శించి, ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది సమస్యలను పరిశీలించారు. రోగులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సీపీఎం ఏరియా కార్యదర్శి ఎం. రామాచారి మాట్లాడుతూ, సుమారు 25 సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఈఎస్ఐ డిస్పెన్సరీ ద్వారా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, సింగరేణి, మున్సిపల్, రైల్వే తదితర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కార్మిక కుటుంబాలకు వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. దాదాపు 40 వేల కుటుంబాలు, సంవత్సరానికి సుమారు 1.60 లక్షల మంది ఓపీ సేవలు పొందుతున్నప్పటికీ, సరిపడా వైద్యులు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆస్పత్రిలో ఐదుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం ఒక్క డిప్యుటేషన్ వైద్యుడే విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ల్యాబ్ ఉన్నప్పటికీ పరీక్షలు నిర్వహించడం లేదని, గతంలో అందుబాటులో ఉన్న ఈసీజీ సేవలు కూడా నిలిచిపోయాయని తెలిపారు. చిన్నపాటి వైద్య పరీక్షల కోసం కూడా ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని బిపి మాత్రలు కుడా బయట కు వెళ్లి తీసుకోవల్సి వస్తుందని అన్నారు.

కార్మికులకు గాయాలైనప్పుడు అవసరమైన టీటీ ఇంజెక్షన్ కూడా అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. డిస్పెన్సరీ భవనం శిథిలావస్థకు చేరుకుని, వర్షపు నీరు గదుల్లోకి కారుతోందని, వెంటనే భవనాన్ని ప్రత్యామ్నాయ ప్రదేశానికి మార్చాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రికి అనుమతులు వచ్చినప్పటికీ నిర్మాణం ప్రారంభం కాలేదని, ప్రభుత్వం వెంటనే ఆస్పత్రి నిర్మాణాన్ని చేపట్టి కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఎం డిమాండ్ చేసింది.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం. రామాచారి, ఎన్. బిక్షపతి, జి. లక్ష్మారెడ్డి, కాదాసి మల్లేష్, గుండు కనకయ్య, టీ. రవీందర్, జి. నాగభూషణం, బి. అశోక్, పవన్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top