డ్రగ్స్‌పై సమష్టి పోరాటమే పరిష్కారం….

Sakshitha news

డ్రగ్స్‌పై సమష్టి పోరాటమే పరిష్కారం….

మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి….

–అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు…

సాక్షిత పెద్దపల్లి// : మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, అధికారులు, విద్యాసంస్థలు సమిష్టిగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు పిలుపునిచ్చారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్‌సీఓఆర్డీ) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాదకద్రవ్యాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, యువత జీవితాలను మాదకద్రవ్యాల మహమ్మారి నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సరదా కోసం కూడా ఎటువంటి మత్తు పదార్థాలకు లేదా చెడు అలవాట్లకు అలవాటు పడవద్దని సూచించారు. ఒకసారి మాదకద్రవ్యాలకు బానిసైతే వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

డ్రగ్స్ విక్రయం, కొనుగోలు, నిల్వ, అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు, ప్రజా ప్రదేశాలు, రవాణా కేంద్రాల్లో తరచూ తనిఖీలు నిర్వహించి మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచే చర్యలు చేపట్టాలని సూచించారు.

డ్రగ్స్ విక్రయం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసు శాఖ లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

సమావేశంలో జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపడుతున్న చర్యలు, నమోదైన కేసులు, అవగాహన కార్యక్రమాలు, వివిధ శాఖల సమన్వయంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖతో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top