వచ్చే వారం ఖిలా వనపర్తి సోలార్ ప్లాంట్ ప్రారంభం….

Sakshitha news

వచ్చే వారం ఖిలా వనపర్తి సోలార్ ప్లాంట్ ప్రారంభం….

ఎలిగేడు 15 వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణ పనులను వేగవంతం చేయాలి….

— జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….

సాక్షిత పెద్దపల్లి// ధర్మారం మండలంలోని ఖిలా వనపర్తి గ్రామంలో నిర్మాణం పూర్తయిన సోలార్ ప్లాంట్‌ను వచ్చే వారం ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. అలాగే ఎలిగేడు మండలంలో నిర్మించనున్న 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాం నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు.

ఖిలా వనపర్తి గ్రామంలో నిర్మాణం పూర్తయిన సోలార్ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించి, పనుల పురోగతిని సమీక్షించారు. ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేసి వచ్చే వారం ప్లాంట్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం ఎలిగేడు మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో నిర్మించనున్న 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గోదాం నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. టెండర్లు పూర్తికాగానే నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి, నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు ఆధునిక నిల్వ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా గోదాం నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, పనుల అమలులో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీఓ శ్రీమాల, ధర్మారం తహసీల్దార్ శ్రీనివాస్, ఎలిగేడు తహసీల్దార్ యాకన్న, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top