విద్యార్థుల సమస్యలపై కేంద్రం సమాధానం చెప్పాలి…
ప్రజాస్వామ్యాన్ని గొంతునొక్కే చర్యలు తగవు….
–ఎంపీ గడ్డం వంశీకృష్ణ…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: . పార్లమెంట్‌లో విద్యార్థులు, యువతకు సంబంధించిన అంశాలపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్యలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశాలు దేశ ప్రజాస్వామ్యానికి సంబంధించిన కీలకమైన ప్రశ్నలను ముందుకు తెచ్చాయని పేర్కొన్నారు. విద్యార్థులు, యువతకు సంబంధించిన ఘటనలు, వారి భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు, దేశ ప్రజలకు స్పష్టమైన సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
విద్యార్థులపై జరిగిన చర్యలు, భద్రతా బలగాల వ్యవహారశైలి వంటి అంశాలపై చర్చ జరగాల్సిన సమయంలో ప్రతిపక్ష సభ్యుల గొంతును వినిపించకుండా మైకులు నిలిపివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై పార్లమెంట్‌లో పూర్తి స్థాయి చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీలు, నిరుద్యోగ సమస్యలు, పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరారు.
యువతకు న్యాయం చేయడం ప్రతి ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతిపక్ష హక్కు మాత్రమే కాకుండా ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని పేర్కొన్న ఎంపీ, ఆ హక్కును పరిమితం చేసే చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో స్వేచ్ఛగా చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు, యువత ప్రయోజనాలను పరిరక్షించే నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
