భారీ వర్షాల ప్రభావంతో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, తెగిపోయిన రహదారులు…

Sakshitha news

భారీ వర్షాల ప్రభావంతో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, తెగిపోయిన రహదారులు…

పెద్దపల్లి జిల్లాలో స్తంభించిన రాకపోకలు…..

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:జూలై-30. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పెద్దపల్లి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మంథని మండల కేంద్రంలోని బొక్కల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు నీరు వ్యవసాయ పొలాల్లోకి చేరడంతో పంటలపై మట్టి పేరుకుపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముత్తారం మండలం ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గ్రామాలకు వెళ్లేందుకు నిర్మించిన మట్టి రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో గరిమెళ్లపల్లి, ఎంచపెల్లి, టేకుమట్ల తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అలాగే మంథని మండలం విరోచవరం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న చెక్‌డ్యామ్‌పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని హుస్సేన్ మియా వాగులోకి మానేరు జలాలు, పంట పొలాల నుంచి వచ్చిన వరద నీరు చేరడంతో వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో గోదావరిఖని, మంథని, ముత్తారం ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లా ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని, వరద నీరు ప్రవహిస్తున్న వాగులు, చెక్‌డ్యామ్‌లు, రహదారులను దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు సూచిస్తున్నారు.

Scroll to Top