తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని ఉద్యమంలా అమలు చేయాలి….
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సెప్టెంబర్ 15లోపు పూర్తి చేయాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, : భూగర్భ జలాలను పెంపొందించి ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. అలాగే మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్ 15లోపు పూర్తి చేయాలని, రెండో విడత అర్హుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ జలసిరి కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, గ్రామీణాభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “విక్షిత్ భారత్ – రోజ్‌గార్, అజీవికా మిషన్”( VBGRAMG) పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ గ్రామాల్లో తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు అవగాహన కల్పిస్తూ వారి అంగీకారంతో పంటకుంటలు (ఫార్మ్‌పాండ్స్) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి (ఏ ఇ ఓ ) ప్రత్యేక చొరవ చూపాలని, ముఖ్యంగా ప్రతి ఆయిల్‌పామ్ రైతు తప్పనిసరిగా ఫార్మ్‌పాండ్ ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో ప్రతి బోర్‌వెల్‌కు రీచార్జ్ పిట్ ఏర్పాటు చేసి భూగర్భ జలాల పునరుద్ధరణకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో అర్హుల ఎంపిక పూర్తిస్థాయి పారదర్శకతతో జరగాలని, మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్ 15లోపు పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మొదటి విడతలో మంజూరు కాకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, గుడిసెల్లో నివసిస్తున్న అర్హుల వివరాలను తక్షణమే సేకరించి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి స్థల విస్తీర్ణానికి సంబంధించిన ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రతి ఇందిరమ్మ ఇంటికి 90 రోజుల ఉపాధి హామీ పనిదినాలు కల్పించడంతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులు సకాలంలో జరిగేలా పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ నరేందర్, డీఆర్‌డీఓ కాళిందిని, పీడీ హౌసింగ్ రాజేశ్వర్, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు

