భారీ వర్షాలపై పోలీసుల హై అలర్ట్
వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా క్షేత్రస్థాయి పరిశీలన – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అప్రమత్తమైంది. పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఎఫ్సీఎల్ ప్రాంతం నుంచి డ్రైనేజీ కాలువల ద్వారా వరద నీరు వీర్లపల్లి గ్రామంలోకి చేరుతున్న నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్‌రావు, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్, భారీ వర్షాల కారణంగా ప్రజలతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వరద నీరు ఇండ్లలోకి చేరే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో బాధితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు 24 గంటలూ అందుబాటులో ఉంటారని, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా వెంటనే స్పందిస్తామని కమిషనర్ తెలిపారు.
గోదావరి, మానేరు నదులు, వాగులు, వంకలు, చెరువుల్లో వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున ప్రజలు వాటి వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు.
వర్షాల కారణంగా రహదారులపై వాహనాలు అదుపు తప్పే అవకాశం ఉన్నందున వాహనదారులు పరిమిత వేగంతో అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. అలాగే పిల్లలు, యువకులు చెరువులు, నదుల వద్దకు సెల్ఫీలు దిగేందుకు లేదా ఈత కొట్టేందుకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ఎలాంటి అత్యవసర సహాయం అవసరమైనా వెంటనే డయల్-100కు కాల్ చేయాలని లేదా సమీపంలోని స్థానిక పోలీసు అధికారులను సంప్రదించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

