మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Sakshitha news

మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా

రాత్రింబవళ్లు పెట్రోలింగ్

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

సాక్షిత మేళ్లచెరువు,

సూర్యాపేట జిల్లా పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరు, పెండింగ్ కేసులు, నేరాల నమోదు, దర్యాప్తు విధానాలను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా మేళ్లచెరువులోని ప్రసిద్ధ శివాలయాన్ని సందర్శించిన ఎస్పీ, మహాశివరాత్రి జాతర సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై ఆలయ అధికారులతో చర్చించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ నవీన్‌తో పాటు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం పలికారు. స్టేషన్ ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొని విద్యార్థులు, పోలీస్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.

వాతావరణ మార్పులను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఎస్పీ పిలుపునిచ్చారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, మహిళలు, బాలబాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మేళ్లచెరువు అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తూ రాత్రింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు వేగవంతమైన పోలీసు సేవలు అందించేందుకు డోర్‌స్టెప్ ఎఫ్‌ఐఆర్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. 100 లేదా 112కు కాల్ చేసిన వెంటనే పోలీసులు బాధితుల వద్దకు చేరుకుని ఫిర్యాదు నమోదు చేసి తక్షణ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం పోలీస్ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు.

Scroll to Top