రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి

Sakshitha news

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి….

— సీపీఐ…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు డిమాండ్ చేశారు.

స్థానిక భాస్కరరావు భవన్‌లో నిర్వహించిన సీపీఐ నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోషిక మోహన్, సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య పాల్గొని మాట్లాడారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో అభివృద్ధి జరగాలంటే అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, అయితే ప్రస్తుతం కార్యాలయంలో అనేక పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలకు సరైన సేవలు అందడం లేదని విమర్శించారు. 60 డివిజన్లకు అవసరమైన 257 పోస్టుల్లో ప్రస్తుతం కేవలం 113 మంది మాత్రమే విధులు నిర్వహిస్తుండగా, 144 పోస్టులు ఖాళీగా ఉండటం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు.

ఇంజనీరింగ్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో పాటు డిప్యూటీ ఇంజనీర్ల కొరత కారణంగా అభివృద్ధి పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్లు కూడా తక్కువ సంఖ్యలో ఉండటంతో కార్పొరేటర్ల అభివృద్ధి పనులకు సంబంధించిన అంచనాలు సిద్ధం చేయడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు.

ప్రజారోగ్య విభాగంలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ల కొరత కారణంగా పారిశుధ్య నిర్వహణ దెబ్బతింటోందని, టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు, సూపర్వైజర్ల కొరతతో పాటు అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయ అండదండలతో కొందరు అధికారులు గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రామగుండం కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలపై విజిలెన్స్ విచారణ జరిపి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రెవెన్యూ విభాగంలో కూడా కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇంటి పన్నుల వసూళ్లు సహా పరిపాలనా వ్యవస్థ దెబ్బతింటోందని పేర్కొన్నారు. పూర్తి స్థాయి కమిషనర్, అదనపు కమిషనర్‌ను నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
రామగుండంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇష్టానుసారంగా కూల్చివేతలు చేపట్టకుండా ముందుగా సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రజలకు వెల్లడించాలని, అనంతరం నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసిన తర్వాతే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఏకపక్ష కూల్చివేతలను సీపీఐ సహించబోదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు మడికొండ ఓదమ్మ, ఆసాల రమ, శనిగరపు చంద్రశేఖర్, సిరిసిల్ల మల్లేష్, కౌన్సిల్ సభ్యులు రాణవేణి సుధీర్ కుమార్, ఆశాల నవీన్, సాదుల శివ, అబ్దుల్ కరీం, తిరుమలతో పాటు నాయకులు పోతరాజు నాగరాజు, అనూప్ సాయి, మసూద్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top