యువతకు ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా జూలై 18న బిఆర్ఎస్ “ఛలో సరూర్నగర్ యువ సంగ్రామ సదస్సు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ “యూత్ డిక్లరేషన్” పేరిట యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ యువజన,విద్యార్ది విభాగం ఆధ్వర్యంలో జూలై 18న సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించనున్న “యువ సంగ్రామ సదస్సు” పోస్టర్ను పార్టీ సీనియర్ నేతలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలతో పాటు యువతను కూడా మోసం చేసిందన్నారు. సరూర్నగర్ స్టేడియంలోనే ప్రియాంక గాంధీ “యూత్ డిక్లరేషన్” పేరిట నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా వాటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో వేలాది ఖాళీలు ఉన్నప్పటికీ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అదే సరూర్నగర్ స్టేడియం నుంచి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ యువజన,విద్యార్ది విభాగం ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు.
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, 2023లో ప్రియాంక గాంధీ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర హామీలన్నీ విస్మరించబడిన నేపథ్యంలో యువత తరఫున పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైందన్నారు. అందుకే అదే సరూర్నగర్ స్టేడియంలో నిరుద్యోగుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే కాకుండా నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వ వైఖరి బాధాకరంగా ఉందన్నారు. పోలీసు శాఖలో సుమారు 20 వేల, విద్యాశాఖలో మరో 20 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఖాళీల భర్తీ కోరితే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. సరూర్నగర్ సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఉద్యోగాల భర్తీ జరిగేలా బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ వైఖరితో తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత అంతా జూలై 18న సరూర్నగర్లో జరిగే యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ యువజన,విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం గొంతెత్తాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
