నిరుద్యోగ సమస్యపై యువత ఐక్యంగా పోరాడాలి…
— ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు చిలక శంకర్…
సాక్షిత పెద్దపల్లి జిల్లా ప్రతినిథి గోదావరిఖని
ఎన్‌టీపీసీ ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఆదివారం ఆరు ముళ్ల తిరుపతి అధ్యక్షతన పీవైఎల్ నిర్మాణ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు చిలక శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో యువతను పట్టించుకునే పరిస్థితి లేదని, నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతూ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువతకు కూడా ఉద్యోగాలు దొరకక రోడ్డు కూలీలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త పరిశ్రమలు స్థాపించకుండా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం వల్ల కార్మికులు, యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించాలంటే యువత అంతా ఐక్యంగా నిలబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
దేశాన్ని “యువ భారతదేశం”గా పేర్కొంటూనే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కొత్త పరిశ్రమలు తీసుకురావడంతో పాటు ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు కే. ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి మాట్లాడుతూ యువత సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు డి. రవీందర్, ఏ. రవి, ఆర్. రాయమల్లు, ఎం. రమేష్, బి. కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పీవైఎల్ ఎన్‌టీపీసీ ఏరియా కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా డి. రమేష్, ఉపాధ్యక్షుడిగా డి. చిరంజీవి, ప్రధాన కార్యదర్శిగా సురేష్, జాయింట్ సెక్రటరీగా పి. రాజేందర్, కోశాధికారిగా ఏ. స్వామిని ఎన్నుకోగా, కమిటీ సభ్యులుగా మోహన్, సంతోష్, మహేందర్‌లను ఎంపిక చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
