ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం… తాండూర్‌లో ఇంటింటికీ వెళ్లి ఎస్ ఐ ఆర్ ఫారమ్‌లు నింపిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ…..
ఓటు హక్కు పరిరక్షణకు ఇంటింటికీ ప్రచారం.. పల్స్ పోలియో కార్యక్రమంలోనూ భాగస్వామ్యం…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి:బెల్లంపల్లి, ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హుడి ఓటు హక్కు సురక్షితంగా ఉండాలనే లక్ష్యంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తాండూర్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. ప్రజల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను తెలుసుకుని, స్వహస్తాలతో ఎస్ ఐ ఆర్ ఫారమ్‌లను నింపుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడం మనందరి బాధ్యత. ఒక్క అర్హుడి ఓటు కూడా కోల్పోకుండా ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాలి” అని అన్నారు.
అనంతరం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి ఎచ్ సి )ను సందర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అక్కడ నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి పోలియో నివారణ చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజల మధ్యే ఉంటూ వారి హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. అలాగే ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించి ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
