గోదావరిఖని బస్టాండ్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
ప్రయాణికులు, ఆటో డ్రైవర్లకు అన్ని సౌకర్యాలతో ఆధునిక బస్టాండ్ నిర్మాణమే లక్ష్యం….
సాక్షిత న్యూస్ పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని .రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గోదావరిఖని బస్టాండ్‌లో చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బస్టాండ్‌ను ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా, ఆధునిక వసతులతో తీర్చిదిద్దేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్టాండ్‌లో ఆధునిక ప్లాట్‌ఫారమ్‌లు, ప్రత్యేక ఆటో స్టాండ్, ఆటో డ్రైవర్లకు విశ్రాంతి సౌకర్యాలు, తాగునీటి ఏర్పాటు, పరిశుభ్రమైన వాష్‌రూమ్‌లు, ఫుట్‌పాత్‌లు, వేచి ఉండేందుకు షెడ్లు, మెరుగైన పారిశుధ్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.
ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని మౌలిక వసతులతో బస్టాండ్‌ను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా ఆటో డ్రైవర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రయాణికులకు తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, సింగరేణి జనరల్ మేనేజర్, సంబంధిత శాఖల అధికారులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
