రామగుండం అభివృద్ధిలో ఎన్‌టీపీసీ భాగస్వామ్యం పెంచాలి….
సీఎస్‌ఆర్, సీడీ నిధులు ప్రభావిత ప్రాంతాలకే కేటాయించాలని సూచన….
ఆర్‌ఓబీలు, సర్వీస్ రోడ్లు, మౌలిక వసతులపై సమీక్ష…
– ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: రామగుండం, రామగుండం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఎన్‌టీపీసీ సంస్థ మరింత బాధ్యతాయుతంగా సహకరించాలని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కోరారు. శుక్రవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ మహంకాళి స్వామి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమిషనర్ జె. అరుణ శ్రీతో కలిసి ఎన్‌టీపీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
ఎన్‌టీపీసీ సంస్థ సీఎస్‌ఆర్, సీడీ నిధులను రామగుండం నియోజకవర్గంలోని ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికే ఖర్చు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కేవలం సీఎస్‌ఆర్ కార్యక్రమాలకే పరిమితం కాకుండా, రెగ్యులర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనుల్లోనూ సంస్థ భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రభావిత ప్రాంతాలను దత్తత తీసుకుని ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
రాజీవ్ రహదారిని ప్రమాదరహితంగా తీర్చిదిద్దేందుకు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి గోదావరి బ్రిడ్జి వరకు నాలుగు ప్రాంతాల్లో రోడ్ ఓవర్ బ్రిడ్జిల (ఆర్‌ఓబీలు) నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అందులో రెండు ఆర్‌ఓబీల నిర్మాణ బాధ్యతను ఎన్‌టీపీసీ స్వీకరించాలని ఎమ్మెల్యే కోరారు.
అలాగే ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఇల్లందు గెస్ట్ హౌస్ వరకు సర్వీస్ రోడ్డు విస్తరణకు వీలుగా ఎన్‌టీపీసీ తన ప్రహరీ గోడను వెనక్కి జరిపి పునర్నిర్మించాలని సూచించారు. శాలపల్లి రోడ్డులోని సోలార్ ప్లాంట్ ప్రహరీ గోడను కూడా వెనక్కి జరిపి నిర్మించాలని తెలిపారు.
నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన భవన నిర్మాణ రుసుమును చెల్లించి, క్వార్టర్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులు పొందాలని ఎన్‌టీపీసీ అధికారులకు సూచించారు. వర్షాకాలంలో వరద ముప్పు నివారణ కోసం ఎన్‌టీపీసీ వ్యర్థజలాలు ప్రవహిస్తున్న కాలువల్లో పూడిక తొలగింపు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, ఎన్‌టీపీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రవీణ్, ఏజీఎం (హెచ్‌ఆర్) రంజన్ సాహో, సీఎస్‌ఆర్ అధికారులు సూర్య, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
