ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలే లక్ష్యం

Sakshitha news

ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలే లక్ష్యం….

ఆర్టీవో, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి:పెద్దపల్లి, ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగవంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

పెద్దపల్లి పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవలు, కార్యాలయాల పనితీరు, రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ విధానాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆర్టీవో కార్యాలయంలో రోజువారీగా బుక్ అవుతున్న స్లాట్లు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ, వాహన రిజిస్ట్రేషన్లు, ఇతర సేవల ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అన్ని సేవలను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం అందించాలని, సేవల అందింపులో ఎలాంటి జాప్యం, అక్రమాలకు తావు లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.

అనంతరం సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి ప్రతిరోజు జరుగుతున్న రిజిస్ట్రేషన్ల వివరాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలు ఎక్కువసేపు వేచి ఉండకుండా వారి పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వం తాజాగా సవరించిన మార్కెట్ విలువల ప్రకారం ప్రతి రిజిస్ట్రేషన్‌ను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రజా సేవలకు సంబంధించిన ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులో పరిష్కరించాలని, కార్యాలయాల్లో ప్రజలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.

ఈ తనిఖీలో ఆర్టీవో కార్యాలయ సిబ్బంది, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top